Tuesday, 5 June, 2007

 

ఒక క్షణంలో

ఒక క్షణంలో
మనస్సులో ఏదో స్మృతి
తటిన్మణి
మణీఘృణి
ఎదో మతి వికాసించి,
క్షణంలో
అదే పరుగు
మరేడకో...
ఆకులలో చీకటిలో
ఇరుల ఇరుకులలో
చినుకులలో
ఏడనో మరపులలో
మరపుల మడతలలో
కనబడక!
ఒక క్షణంలో
పూర్వపు సఖుని ముఖం
నవ్వులతో
రంగుల పువ్వులతో
కలకలమని కళలు కురిసి
హర్షంతో
ఆశావర్షంతో
కనులవెనుక తెరముందర
కనిపించి,
మరుక్షణం
విడివడి మరేడకో-
వడివడి మరేడకో!
ఒక క్షణంలో
సకల జగం!
సరభస గమనంతో....
పిమ్మట నిశ్శబ్దం
ఆ క్షణమందే
గుండెల కొండలలో
మ్రోగును మార్మ్రోగును
హుటిహుటి పరుగెత్తే
యుగాల రథనాదం.

Labels:


 

ఆ:!

నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెగిరిపోతే,
నిబిడాశ్చర్యంతో వీరు-

నెత్తురు క్రక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే,
నిర్దాక్షిణ్యంగా వీరే...

Labels:


 

పరాజితులు

అలసిన కన్నులు కాంచేదేమిటి?
తొణికిన స్వప్నం,
తొలగిన స్వర్గం!

చెదిరిన గుండెల నదిమే దేమిటి?
అవతల, ఇవతల
అరులై ఇరులే!

విసిగిన ప్రాణుల పిలిచె దెవ్వరు?
దుర్హతి, దుర్గతి,
దుర్మతి, దుర్మృతి!

Labels:


 

కళారవి

పోనీ, పోనీ,
పోతే పోనీ,
సతుల్, సుతుల్, హితుల్, పోనీ!
పోతే పోనీ!


రానీ, రానీ,
వస్తే రానీ,
కష్టాల్, నష్టాల్,
కోపాల్, తాపాల్, శాపాల్ రానీ!
వస్తే రానీ!
తిట్లూ, రాట్లూ, పాట్లూ, రానీ!
రానీ, రానీ!

కానీ, కానీ!
గానం, ధ్యానం!
హాసం, లాసం!
కానీ, కానీ,
కళారవీ!, పవీ!, కవీ!

Labels:


 

సాహసి

ఎగిరించకు లోహవిహంగాలను!
కదిలించకు సుప్త భుజంగాలను!
ఉండనీ,
మస్తిష్కకులయంలో!
మనోవల్మీకంలో!


అంతరాళ భయంకర
ప్రాంతరాలనా నీ విహారం?
ముళ్ళాదారినా నీ సంచారం?


పలికించకు మౌనమృదంగాలను!
కెరలించకు శాంత తరంగాలను!
హృదయంలో దీపంపెట్టకు!
మంత్రనగరి సరిహద్దులు ముట్టకు!

Labels:


 

అవతలి గట్టు

--ఇవేమిటి వింత భయాలు?
--ఇంట్లో చీకటి!

--ఇవేమిటి అపస్వరాలు?
--తెగింది తీగ!

--అవేమిటా రంగుల నీడలు?
--చావూ, బ్రదుకూ!

--ఎచటికి పోతా వీ రాత్రి?
--అవతలి గట్టుకు!

Labels:


 

భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని,
వైప్లవ్యగీతాన్ని నేను!
స్మరిస్తే పద్యం,
అరిస్తే వాద్యం,
అనల వేదికముందు అస్రనైవేద్యం!


లోకాలు, భవభూతి శ్లోకాలు,
పరమేష్ఠి జూకాలు నా మహోద్రేకాలు!
నా ఊహ చాంపేయమాల!
రస రాజ్యడోల!
నా ఊళ కేదారగౌళ!


గిరులు, సాగరులు, కంకేళికా మంజరులు,
ఝురులు నా సోదరులు!
నే నొక దుర్గం!
నాదొక స్వర్గం!
అనర్గళం, అనితరసాధ్యం, నా మార్గం;

Labels:


 

ఆశాదూతలు

స్వర్గాలు కరిగించి, స్వప్నాలు పగిలించి,
రగిలించి రక్తాలు, రాజ్యాలు కదిపి -
ఒకడు తూరుపు దిక్కునకు!


పాపాలు పండించి, భావాలు మండించి,
కొలిమి నిప్పులు రువ్వి, విలయలయ నవ్వి-
ఒకడు దక్షిణ దిక్కు!


ప్రాకారములు దాటి, ఆకాశములు తాకి,
లోకాలు ఘాకాల బకాలతో నించి,
ఒక డుదీచికి!


సిందూర భస్మాలు, మందార హారాలు,
సాంద్రచందనచర్చ సవరించి
ఒకడు పడమటికి!


మానవకోటి సామ్రాజ్యదూతలు, కళా
యజ్ఞాశ్వముల్ గాలులై, తరగలై, తావులై,
పుప్పాళ్ళ, కుంకుమల్, పొగలై సాగిరి!

Labels:


 

అవతారం

యముని మహిషపు లోహ ఘంటలు
మబ్బు చాటున
ఖణేల్మన్నాయి!


నరకలోకపు జాగిలమ్ములు
గొలుసు త్రెంచుకు
ఉరికిపడ్డాయి!


ఉదయ సూర్యుని సప్తహయములు
నురుగులెత్తే
పరుగు పెట్టేయి!


కనకదుర్గా చండ సింహం
జూలు దులిపీ,
ఆవులించింది!


ఇంద్రదేవుని మదపు టేనుగు
ఘీంకరిస్తూ,
సవాల్ చేసింది!


నంది కేశుడు రంకె వేస్తూ,
గంగడోలును
కదిపి గెంతేడు!


ఆదిసూకర వేద వేద్యుడు
ఘర్ఘురిస్తూ,
కోర సాచాడు!


పుడమి తల్లికి
పురుటి నొప్పులు
కొత్త సృష్టిని స్ఫురింపించాయి!

Labels:


 

బుక్కులు

కుక్కపిల్లా, అగిపుల్లా, సబ్బుబిళ్ళా-
హీనంగా చూడకు దేన్నీ!
కవితామయమేనోయ్ అన్నీ!
రొట్టేముక్కా!, అరటితొక్కా, బల్లచెక్కా-
నీ వేపే చూస్తూ ఉంటాయ్!
తమ లోతు కనుక్కోమంటాయ్!
తలుపుగొళ్ళెం, హారతిపళ్ళెం, గుర్రపుకళ్ళెం-
కాదేదీ కవిత కనర్హం!
ఔనౌను శిల్ప మనర్ఘం!
ఉండాలోయ్ కరితావేశం!
కానీవోయ్ రస నిర్దేశం!
దొరకదటోయ్ శోభాలేశం!
కళ్ళంటూ ఉంటేచూసి,
వాక్కుంటే వ్రాసీ!
ప్రపంచమొక పద్మవ్యూహం
కవిత్వమొక తీరని దాహం!

Labels:


Monday, 4 June, 2007

 

ఆకాశదీపం

గదిలో ఎవరూ లేరు,
గదినిండా నిశ్శబ్దం.
సాయంత్రం ఆరున్నర,
గదిలోపల చినుకులవలె చీకట్లు.


ఖండపరశుగళ కపాలగణముల
కనుకొలకులలో ఒకటివలె
చూపులేని చూపులతో తేరి
చూస్తున్నది గది.


గదిలోపల ఏవేవో ఆవిరులు
దూరాన నింగిమీద
తోలిన ఒక చుక్క
మిణుకు చూపులు మెల్లమెల్లగా విసిరి
గదిని తలపోతతో కౌగిలించుకొంటున్నది.


ఒక దురుదృష్టజీవి
ఉదయం ఆరున్నరకు
ఆ గదిలోనే ఆరిపోయాడు.


అతని దీపం ఆ గదిలో
మూలనక్కి మూలుగుతున్నది.
ప్రమిదలో చమురు త్రాగుతూ
పలు దిక్కులు చూస్తున్నది.
చీకటి బోనులో
సింహములా నిలుచున్నది.
కత్తిగంటు మీద
నెత్తుటి బొట్టులాగున్నది.
ప్రమిదలో నిలిచి
పలుదిక్కులు చూస్తున్నది దీపం.


అకస్మాత్తుగా ఆ దీపం
ఆకాశతారను చూసింది.
రాకాసి కేకలు వేసింది.
(నీకూ నాకూ చెవుల సోకని కేకలు.)
ఆకాశతార ఆదరపుచూపులు చాపింది.
అలసిపోయింది పాపం, దీపం.
ఆకాశతార ఆహ్వాన గానం చేసింది.
దీపం ఆరిపోయింది.
తారగా మారిపోయింది.

Labels:


 

గంటలు

పట్టణ్ణాలలో, పల్లెటూళ్ళలో,
బట్టబయలునా, పర్వతగుహలా,
ఎడారులందూ, సముద్రమందూ,
అడవుల వెంటా, అగడ్తలంటా,
ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తూ


గంటలు! గంటలు! గంటలు! గంటలు!
గంటలు! గంటలు!
గణగణ గణగణ గణగణ గంటలు!
గణగణ గణగణ
గంటలు! గంటలు!


భయంకరముగా, పరిహాసముగా,
ఉద్రేకముతో, ఉల్లాసముతో,
సక్రోధముగా, జాలిజాలిగా,
అనురాగముతో, ఆర్భాటముతో,
ఒక మారిచటా, ఒక మారచటా


గంటలు! గంటలు!
గంటలు! గంటలు!


సింహములాగూ, సివంగిలాగూ,
ఫిరంగిలాగూ, కురంగిలాగూ,
శంఖములాగూ, సర్పములాగూ,
సృగాలమట్లూ, బిడాలమట్లూ,
పండితులట్లూ, బాలకులట్లూ,

గొణగొణ గణగణ
గణగణ గొణగొణ
గంటలు! గంటలు!
గంటలు! గంటలు!


కర్మాగారము, కళాయతనమూ,
కార్యాలయమూ, కారాగృహముల,
దేవునిగుడిలో, బడిలో, మడిలో
ప్రాణము మ్రోగే ప్రతిస్థలములో,
నీ హృదయములో, నాహృదయములో


గంటలు! గంటలు!
గంటలు! గంటలు!


ఉత్తరమందూ, దక్షిణమందూ,
ఉదయమునందూ, ప్రదోషమందూ,
వెన్నెలలోనూ, చీకటిలోనూ,
మండు టెండలో, జడిలో, చలిలో,
ఇపుడూ, అపుడూ, ఎపుడూ, మ్రోగెడు



గంటలు! గంటలు!గంటలు! గంటలు!
గంటలు! గంటలు!గంటలు! గంటలు!
గణగణ గణగణ గంటలు! గంటలు!
గంటలు! గంటలు!
గంటలు! గంటలు!

Labels:


 

ఒక రాత్రి

గగనమంతా నిండి, పొగలాగు క్రమ్మి -
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!


ఆకాశపు టెడారి నంతటా, అకట!
ఈ రేయి రేగింది ఇసుక తుపాను!


గాలిలో కానరాని గడుసు దయ్యాలు
భూ దివమ్ములమధ్య ఈదుతున్నాయి

నోరెత్తి, హోరెత్తి నొగులు సాగరము!
కరి కళేబరములా కదలదు కొండ!

ఆకాశపు టెడారిలో కాళ్ళు తెగిన
ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి!

విశ్వమంతా నిండి, వేలిబూదివోలె-
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!

Labels:


 

జయభేరి

నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!


నేను సైతం
విశ్వవృష్టికి
అశ్రు వొక్కటి ధారపోశాను!


నేను సైతం
భువన ఘోషకు
వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!

* * *

ఎండాకాలం మండినఫ్ఫుడు
గబ్బిళంవలె
క్రాగిపోలేదా!


వానాకాలం ముసిరిరాగా
నిలువు నిలువున
నీరు కాలేదా?
శీతాకాలం కోతపెట్టగ
కొరడు కట్టీ,
ఆకలేసీ కేకలేశానే!

* * *

నే నొకణ్ణే
నెల్చిపోతే-
చండ్ర గాడ్పులు, వానమబ్బులు, మంచుసోనలు
భూమి మీదా
భుగ్నమౌతాయి!


నింగినుండీ తొంగిచూసే
రంగు రంగుల చుక్కలన్నీ
రాలి, నెత్తురు క్రక్కుకుంటూ
పేలిపోతాయి!


పగళ్ళన్నీ పగిలిపోయీ,
నిశీథాలూ విశీర్ణిల్లీ,
మహాప్రళయం జగం నిండా
ప్రగల్భిస్తుంది!
* * *


నే నొకణ్ణీ ధాత్రినిండా
నిండిపోయీ-
నా కుహూరుత శీకరాలే
లోకమంతా జల్లులాడే
ఆ ముహూర్తా లాగమిస్తాయి!

* * *

నేను సైతం
ప్రపంచాబ్జపు
తెల్లరేకై పల్లవిస్తాను!


నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై మూర్ఛనలు పోతాను!

నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను!

Labels:


 

మహా ప్రస్థానం

మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు,
పడండి త్రోసుకు!
పోదాం, పోదాం పైపైకి!


కదం త్రొక్కుతూ,
పదం పాడుతూ,
హృదంతరాళం గర్జిస్తూ-
పదండి పోదాం,
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం?


దారిపొడుగునా గుండె నెత్తురులు
తర్పణచేస్తూ పదండి ముందుకు!
బాటలు నడచీ,
పేటలు కడచీ,
కోటలన్నిటినీ దాటండి!
నదీ నదాలు,
అడవులు, కొండలు,
ఎడారులా మన కడ్డంకి?



పదండి ముందుకు!
పడండి త్రోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!
ఎముకలు క్రుళ్ళిన,
వయస్సు మళ్ళిన
సోమరులారా! చావండి!
నెత్తురు మండే,
శక్తులు నిండే,
సైనికులారా రారండి!
"హరోం! హరోం హర!
హర! హర! హర! హర!
హరోం హరా!" అని కదలండి!
మరో ప్రపంచం,
మహా ప్రపంచం
ధరిత్రినిండా నిండింది!
పదండి ముందుకు!
పదండి త్రోసుకు!
ప్రభంజనంవలె హోరెత్తండీ!
భావ వేగమున ప్రసరించండీ!
వర్షుకాభ్రముల ప్రళయఘోషవలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!
పదండి,
పదండి,
పదండి ముందుకు!
కనబడలేదా మరో ప్రపంచపు
కణకణమండే త్రేతాగ్ని?


ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవి
ఎనభై లక్షల మేరువులు!
తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్
జలప్రళయ నాట్యం చేస్తున్నవి!
సలసలక్రాగే చమురా? కాదిది
ఉష్ణరక్త కాసారం!
శివసముద్రమూ,
నయాగరావలె
ఉరకండీ! ఉరకండీ ముందుకు!
పదండి ముందుకు!
పడండి త్రోసుకు!
మరో ప్రపంచపు కంచు నగారా
విరామ మెరుగక మ్రోగింది!


త్రాచువలెనూ,
రేచులవలెనూ,
ధనంజయునిలా సాగండి!
కనబడలేదా మరో ప్రపంచపు
అగ్నికిరీటపు ధగధగలు,
ఎర్రబావుటా నిగనిగలు,
హోమజ్వాలల భుగభుగలు?

Labels:


This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]